భక్తుల ద్వారా ఆదుకునే భగవంతుడు

నిజమైన భక్తులు నిరంతరం భగవంతుడి గురించిన ఆలోచనలే చేస్తుంటారు. బాహ్య ప్రపంచంలోని ఎలాంటి విషయాల పట్ల ఆసక్తిని చూపించకుండా, భగవంతుడి లీలావిశేషాలను తలచుకుంటూ ఆ తన్మయత్వంలో తేలిపోతుంటారు. అలాంటివాళ్లను సామాన్య ప్రజానీకం అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక ఊళ్లో 'శంకు' అనే భక్తుడు ఉండేవాడు .. నిరంతరం దైవ నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక పరమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు.

అలాంటి ఆయనను వెతుక్కుంటూ ఒక శ్రీమంతుడు ఆ ఊరుకు వస్తాడు. శంకు గురించి అక్కడివారిని అడుగుతాడు. ఆ పిచ్చి వ్యక్తితో పనేమిటని ఆ గ్రామస్థులు కొందరు ఆ శ్రీమంతుడిని అడుగుతారు. చాలా కాలంగా తాను ఒక వ్యాధితో బాధపడుతున్నాననీ, కలలో భగవంతుడు కనిపించి 'శంకు'ను ఆశ్రయించమని చెప్పాడని అంటాడు. దాంతో వాళ్లంతా ఆశ్చర్యపోతూనే ఆ శ్రీమంతుడిని 'శంకు' దగ్గరికి తీసుకెళతారు. ఆ శ్రీమంతుడు తాను వచ్చిన పని చెప్పగా ఆయకి 'శంకు' ఒక ఫలాన్ని ఇచ్చి తినమని చెబుతాడు. ఆ ఫలాన్ని తినగానే ఫలితం కనిపించడంతో ఆ శ్రీమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అది చూసిన ఆ గ్రామస్థులకు 'శంకు' ఎంతటి భక్తుడనేది అర్థమవుతుంది. అప్పటి నుంచి వాళ్లంతా ఆయనని శ్రద్ధతో సేవించడం మొదలుపెడతారు.        


More Bhakti News