అలాంటివారే గమ్యానికి చేరుకోగలరు
జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే అందరూ ప్రయత్నిస్తుంటారు. తాము అనుకున్న గమ్యానికి చేరుకోవడం కోసం ఎంతగానో కృషి చేస్తుంటారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు .. కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. శారీరకపరమైన .. మానసిక పరమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అయినా వాటిని లెక్కచేయకుండగా ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇక ఒక ఆశయసిద్ధితో ముందుకు సాగిపోతున్నప్పుడు చాలామంది చాలా రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. విమర్శలతో మనసుకు కష్టాన్ని కలిగించి .. మానసికంగా దెబ్బతీసి అవతలివారి ప్రయత్నాన్ని నీరుగార్చడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు.
ఆ ప్రభావం కారణంగా కుప్పకూలిపోతే తమ పాచిక పారినందుకు వాళ్లు ఆనందిస్తారు. అందువలన ఆ విమర్శలకు బాధపడుతూ కూర్చోకూడదు .. అలా అని వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నమూ చేయకూడదు. ఏ పని లేనివాళ్లే అలా ఇతరులను విమర్శిస్తూ కూర్చుంటారని మనసుకు సర్ది చెప్పుకుని ముందుకు సాగిపోవాలి. 'ఉలి' దెబ్బలకు తట్టుకుంటేనే 'శిల' .. 'శిల్పం' గామారుతుంది. 'ఉలి' దెబ్బలకి తట్టుకుంటేనే బండరాయి సైతం దేవతా మూర్తిగా మారి పూజలు అందుకుంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, పట్టుదల .. సహనం సడలిపోకుండా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు .. అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు.