రామానుజాన్ని కాంచీపురానికి చేర్చిన లక్ష్మీనారాయణులు
రామానుజుల వారు తన జీవితం భగవంతుడి సేవకు అంకితం చేశారు. భగవంతుడి దృష్టిలో అంతా సమానులే .. మోక్షానికి అందరూ అర్హులే అనే బలమైన నమ్మకంతో ఆయన ఉండేవారు. అలాంటి రామానుజుల వారు కాంచీపురంలోని యాదవప్రకాశుడనే గురువు దగ్గర శిష్యుడిగా చేరాడు. కాలం గడుస్తున్నా కొద్దీ రామానుజులవారిలోని గొప్పతనాన్ని ఆ గురువు గ్రహించాడు. ఆ రోజు నుంచి ఆయనకి రామానుజులవారి పట్ల ఈర్ష్యాద్వేషాలు పెరుగుతూ రాసాగాయి. దాంతో ఆయన రామానుజులవారిని ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో, ఒక పథకం ప్రకారం మరికొంతమంది శిష్యులతో యాత్రలకు పంపిస్తాడు.
ఆ శిష్యులలో తనకి సన్నిహితుడైన ఒకరి ద్వారా గురువుగారి మనసులో ఏవుందనే విషయం రామానుజుల వారికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆ శిష్య బృందం నుంచి విడిపోయి .. తిరిగి కాంచీపురానికి బయలుదేరాడు. చాలా దూరం నడిచిన కారణంగా అలసిపోయిన ఆయనకి మార్గమధ్యంలో బోయ దంపతులు తారసపడతారు. తాము కూడా కాంచీపురం వెళుతున్నట్టుగా రామానుజులవారితో చెబుతారు. కొంతసేపు విశ్రమించమనీ .. తరువాత కాంచీపురం వెళదామని అంటారు. దాంతో రామానుజులవారు నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేచి చూసిన ఆయనకి ఆ బోయ దంపతులు కనిపించరు .. వాళ్ల కోసం చుట్టుపక్కల చూసిన ఆయనకి కాంచీపురం ఆలయ గోపురం కనిపిస్తుంది. దాంతో లక్ష్మీ నారాయణులే బోయ దంపతుల రూపంలో తనని కాంచీపురానికి చేర్చినట్టు ఆయన గ్రహించి మనసులోనే నమస్కరిస్తాడు.