ఏ జీవినైనా ప్రాణభయం వెంటాడుతూనే ఉంటుంది

చనిపోయే సమయంలో ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచన చేస్తుంటారో .. ఏ విషయమైతే మనసులో మెదులుతుందో అందుకు తగినట్టుగానే ఆ తరువాత జన్మ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూరి శర్మ కథ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పూర్వం సూరి శర్మ అనే ఒక బ్రాహ్మణుడు .. పూజకి అవసరమైన పూల కోసం తన సోదరులతో కలిసి అడవికి వెళతాడు. అక్కడ ఒక లేడి ఆనందంతో గంతులు వేస్తుండటం చూసి .. తాను కూడా లేడిని అయితే ఎంతో బాగుండునో కదా అనుకుంటాడు. అంతలో ఒక పులి వచ్చి ఆ లేడిని వేటాడి చంపేస్తుంది. భయంతో అక్కడి నుంచి పరుగెత్తబోయి పడిపోయిన సూరి శర్మ తలకి బలమైన గాయం కావడంతో మరణిస్తాడు.

లేడిలా జన్మించాలని మనసులో అనుకుంటూ చనిపోయిన కారణంగా సూరి శర్మ లేడిలా జన్మిస్తాడు. వేటగాళ్ల బారి నుంచి తప్పించుకుంటూ నానా కష్టాలు పడుతుంటాడు. ఏ జీవినైనా ప్రాణభయం వెంటాడుతూ ఉంటుందనీ .. కష్టాలు .. బాధలు వుంటాయని గ్రహిస్తాడు. అందువలన మోక్షాన్ని పొందాలని నిర్ణయించుకుని .. అందుకోసం ఏం చేయాలో తెలియక లేడి రూపంలో అడవిలోనే తిరుగుతూ ఉంటాడు. ఒక రోజున నదిలో స్నానమాచరించి వెళుతోన్న పరశురాముడిని గుర్తించి, ఆయనని అనుసరిస్తూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. పరశురాముడికి అగస్త్యుడు 'కృష్ణకవచం' ఉపదేశిస్తూ ఉండగా విని మోక్షాన్ని పొందుతాడు.        


More Bhakti News