పూరి జగన్నాథుడి లీలా విశేషం
పూర్వం ఢిల్లీని పరిపాలిస్తోన్న పాదుషా .. తనకి మెత్తుటి దిండ్లు రెండు తయారు చేసి తీసుకు వచ్చే బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగిస్తాడు. పూరి జగన్నాథుడి భక్తుడైన ఆ వ్యక్తి ఎంతో శ్రద్ధ పెట్టి రెండు దిండ్లు తయారు చేస్తాడు. అందులో ఒక దిండును పూరి జగన్నాథుడికి ఇస్తే బాగుంటుందని ఆయన అనుకుంటాడు. అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. పూరి జగన్నాథుడు ఒక దిండును స్వీకరించి అది చాలా బాగుందని తనని మెచ్చుకుంటున్నట్టుగా అనిపించడంతో ఆనందంతో నిద్రలేస్తాడు. తనకి వచ్చింది 'కల' అనుకుని తిరిగి నిద్రలోకి జారుకోబోతూ .. తాను రెండు దిండ్లు ఉంచిన చోటున ఒకటి మాత్రమే ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.
జరిగిన సంఘటన నిజమని భావించి ఆనందంతో పొంగిపోతాడు. రెండు దిండ్లు తీసుకురమ్మని చెప్పిన సమయానికి ఆ వ్యక్తి ఒకటి మాత్రమే తీసుకురావడం .. మరో దిండును జగన్నాథస్వామికి ఇచ్చానని చెప్పడం పాదుషాకి కోపం తెప్పిస్తాయి. దాంతో ఆయన ఆ వ్యక్తిని చెరసాలలో వేయిస్తాడు. ఆ రోజు రాత్రి ఈ విషయంలో తనని ఎవరో మందలిస్తున్నట్టుగా అనిపించడంతో పాదుషా ఆలోచనలో పడతాడు. మరునాడు ఉదయం చెరసాలలో ఉంచబడిన వ్యక్తి దగ్గరికి వెళతాడు. చెరసాల తెరవబడి ఉండటం .. ఆ వ్యక్తి సంకెళ్లు తెగిపడి ఉండటం చూసిన పాదుషాకి విషయం అర్థమవుతుంది. జగన్నాథుడిని కీర్తిస్తూ తనని తాను మైమరచిపోయి వున్న ఆ వ్యక్తిని సగౌరవంగా ఇంటికి పంపిస్తాడు.