సుకన్యను పరీక్షించిన అశ్వినీదేవతలు
రాజకుటుంబానికి చెందిన సుకన్య .. ఒక రోజున తన తల్లిదండ్రులతో కలిసి విహారానికి అడవికి వెళుతుంది. ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న 'చ్యవన మహర్షి'కి .. సుకన్య కారణంగా చూపుపోతుంది. తన వలన జరిగిన తప్పుకు ప్రాయచ్చిత్తంగా ఆ మహర్షిని పెళ్లాడి, ఆయనతో పాటు అడవిలోని ఆశ్రమంలోనే సుకన్య వుండిపోతుంది. అనునిత్యం చ్యవన మహర్షికి పూజా ద్రవ్యాలు సమకూర్చుతూ ఆయనకి సేవలు చేస్తూ ఉంటుంది. ఒకసారి అటుగా వచ్చిన అశ్వినీదేవతలు .. చ్యవన మహర్షిని చులకన చేసి మాట్లాడతారు. తమలో ఒకరిని వివాహం చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించమని అంటారు.
ఆ మాటలకు సుకన్య ఆగ్రహించడంతో .. అశ్వినీదేవతలు తగ్గుతారు. చ్యవన మహర్షికి చూపు .. యవ్వనం ప్రసాదిస్తామని అంటారు. ఆ సమయంలో తాము కూడా ఆయన రూపాన్ని పొందుతామనీ .. తమ ముగ్గురిలో అసలు భర్తను గుర్తించి ఆయన మెడలో పూల మాల వేయవలసి వుంటుందనే నిబంధన పెడతారు. భర్త అనుమతితోనే అందుకు సుకన్య అంగీకరిస్తుంది. చ్యవన మహర్షి చూపు .. యవ్వనం పొందగానే, ఆయనలా అశ్వినీదేవతలు మారిపోతారు. జగన్మాతను సుకన్య తలచుకుని .. ఆ ముగ్గురిలో ఎవరైతే తన భర్తనో ఆయన మెడను అలంకరించమని పూల మాల వదులుతుంది. అది నేరుగా వెళ్లి యవ్వనవంతుడైన చ్యవన మహర్షి మెడలోనే పడుతుంది. ఆమె పాతివ్రత్య మహిమ చూసి అశ్వినీదేవతలు నిజరూపాలను పొంది .. తమని మన్నించమని కోరతారు.