అదే రామానుజులవారి గొప్పతనం

కంచి వరదరాజస్వామి సన్నిధిలో శ్రీరామానుజులవారు సన్యాసం స్వీకరిస్తారు. ఆ తరువాత 'శ్రీరంగం' వెళ్లిన రామానుజులవారు 'తిరుకోష్టియూర్ నంబి' దగ్గర 'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశంగా పొందుతారు. ఆయనకి ఆ మంత్రాన్ని ఉపదేశించిన గురువుగారు, ఈ మంత్రాన్ని స్మరించినవారికి మోక్షం లభిస్తుందనీ .. అందువలన దానిని ఎవరికీ చెప్పొద్దని అంటారు. అక్కడి నుంచి మౌనంగా వెనుదిరిగిన రామానుజులవారు ఆలయ గోపురంపైకి చేరుకుంటారు.

ఆయన ఎందుకలా చేస్తున్నది అర్థంకాక గురువుగారు ఆశ్చర్యంతో చూస్తుంటారు. రామానుజులవారు గోపురం పైకెక్కడం చూసి జనమంతా అక్కడ గుమిగూడతారు. వాళ్లందరినీ ఉద్దేశిస్తూ రామానుజులవారు " నేను చెప్పే మంత్రాన్ని మూడుమార్లు పలకండి .. మీకు ముక్తి లభిస్తుంది" అంటూ 'ఓం నమో నారాయణాయ .. ఓం నమో నారాయణాయ .. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వాళ్లతో మూడుమార్లు పలికిస్తారు. ఆ తరువాత గురువుగారి దగ్గరికి వచ్చి .. ' నేనేమైపోయినా ఫరవాలేదు .. వేలాదిమంది ముక్తిని పొందుతారని అలా చేశాను' అంటారు. ఆ గురువుగారు రామానుజులవారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని మనస్ఫూర్తిగా అభినందిస్తారు.        


More Bhakti News