శ్రీరాముడు ఇక్కడి నుంచే మాయలేడిని కొట్టాడట

సీతాదేవిని అపహరించాలనుకున్న రావణుడు .. అది ఆమె ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే సాధ్యమని భావిస్తాడు. ఆమె నుంచి రాముడిని దూరంగా తీసుకెళ్లమని మారీచుడిని ఆదేశిస్తాడు. మారీచుడు బంగారు లేడి రూపాన్ని ధరించి రావడంతో సీతాదేవి చూసి ముచ్చట పడుతుంది. ఆ లేడి కోసం శ్రీరాముడు దానివెంట పరుగుతీస్తాడు. శ్రీరాముడిని పర్ణశాలకు దూరంగా తీసుకెళ్లడం కోసం ఆ లేడి చాలా వేగంగా పరుగులు తీస్తూ, ఒక చోట ఒక రాతిబండను దాటుకుని వెళుతుంది.

ఆ రాతి బండపైకి చేరుకున్న శ్రీరాముడు తన 'మోకాలు'ను నేలకి ఆనించి కూర్చుని బాణం వదులుతాడు. ఆ బాణం దెబ్బకి లేడి రూపంలోని మారీచుడు నేలకు ఒరుగుతాడు. ఈ ప్రదేశమే ఇప్పుడు 'జీడికల్లు'గా పిలబడుతోంది. ఇది వరంగల్ జిల్లా లింగాల ఘన పురం మండలం పరిధిలో కనిపిస్తుంది. ఇక్కడి రాతి బండపై శ్రీరాముడి పాద ముద్రలు .. మాయలేడి పాద ముద్రలు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే శ్రీరాముడు తన మోకాలిని ఆనించాడో అక్కడ కూడా ఆ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఇక్కడి వాళ్లు 'మోకాలి గుంట'గా పిలుస్తుంటారు. ఈ గుంటలో నుంచి అదే పనిగా నీరు ఊరుతూ ఉంటుంది. అప్పట్లో ఈ నీరుతోనే శ్రీరాముడు .. మారీచుడి దాహాన్ని తీర్చాడట. దాహం తీర్చుకున్న తరువాత మారీచుడు శాప విమోచనాన్ని పొందాడని అంటారు.  


More Bhakti News