దురాశకిపోతే దుఃఖమే మిగులుతుంది

ఒకసారి ఒక లోభి .. ఒక సాధువు దగ్గరికి వస్తాడు. తాను మహిమాన్వితుడనని తెలుసుకుని .. తన ద్వారా లాభం పొందాలనే దురాశతోనే ఆ లోభి వచ్చాడని ఆ సాధువు గ్రహిస్తాడు. ఆయనలోని స్వార్థ స్వభావం తొలగించాలని నిర్ణయించుకుంటాడు. ఓ వారం రోజుల్లో ఆయన ఆయుష్షు తీరనుందనీ .. ఎప్పటిమాదిరిగానే ఈ వారం రోజులను కూడా గడిపేయమని చెబుతాడు. తన ఆయుష్షు తీరిపోనుందని తెలియగానే, ఆ లోభి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు.

తన వలన బాధపడిన బంధుమిత్రులకు .. ఇతరులకు క్షమాపణ చెబుతూ వస్తాడు. ఎంతోమంది మనసును కష్టపెడుతూ తాను కూడబెట్టిందంతా పేదలకు పంచుతూ ఉంటాడు. కష్టాల్లో వున్నవారికి సాయపడుతూ .. సంతృప్తిని పొందుతూ వస్తాడు. వారం రోజులు పూర్తవుతుండగా వెళ్లి ఆ సాధువును కలుసుకుని, తాను ఈవారం రోజుల పాటు చేస్తూ వచ్చిన పనులను గురించి చెబుతాడు.

అప్పుడు ఆ సాధువు నవ్వేసి .. మరణమనేది ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు. ఈలోగా ఆశలకు .. వ్యామోహాలకు బానిసలుగా మారకూడదు. జీవితంలో సంపద ఎంత అవసరమో .. అంతే సమకూర్చుకోవాలి. దురాశకిపోతే దుఃఖమే మిగులుతుంది .. ఏదీ వెంటరాదనే సత్యాన్ని గ్రహించి స్వార్థాన్ని విడిచిపెట్టాలి. పదిమందికి సాయపడటం వలన కలిగే సంతృప్తి .. మరణమంటే భయం లేకుండా చేస్తుంది ..  జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది. ఈ వారమంతా ఎలా జీవిస్తూ వచ్చావో .. అలాగే మిగతా జీవితాన్ని కొనసాగించమని ఆశీర్వదిస్తాడు.       


More Bhakti News