కోరికలు నెరవేర్చు కోదండరాముడు

మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు .. ఆదర్శవంతమైన ఇల్లాలికి ఆనవాలు సీతమ్మ. సీతారాములను చూడముచ్చటైన జంటగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే అన్యోన్యంగా వుండే దంపతులను సీతారాములతో పోలుస్తూ వుంటారు. అలాంటి సీతారాములకు ప్రతి గ్రామంలోను ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. రామాలయం లేని ఊరంటూ దాదాపుగా కనిపించదు. సీతారాములు కొన్ని కోట్ల స్వయంభువులుగా ఆవిర్భవిస్తే .. మరికొన్ని ప్రదేశాల్లో మహర్షుల అభ్యర్థన మేరకు అవతరించారు. ఇంకొన్ని చోట్ల భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం కొలువుదీరారు. భక్తుల కోసం కొలువైన రామాలయాలలో ఒకటి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిథినిలోని 'రామ్ నగర్ బంధం'లో కనిపిస్తుంది.

మిర్యాలగూడ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ రామాలయం కనిపిస్తూ ఉంటుంది. చాలాకాలం క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడికి కలలో స్వామివారు కనిపించి, తనకి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని చెప్పాడట. దాతల సహాయ సహకారాలతో ఆ భక్తుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి, హనుమ సమేత సీతారామలక్ష్మణులను .. గణపతిని ప్రతిష్ఠింపజేశాడు. ఆనాటి నుంచి నిత్య ధూప దీప నైవేద్యాలు కొనసాగుతున్నాయి. ఇక్కడి సీతారాముల దర్శనం వలన .. హనుమంతుడికి సిందూర అభిషేకం జరిపించడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ప్రతి బుధవారం ఇక్కడి ఆలయంలో జరిగే భజన కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున భారీయెత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ రోజున సీతారాముల కళ్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు.     


More Bhakti News