కాశీ క్షేత్రంలో 'యమాదిత్యుడు' ప్రత్యేకత
కాశీ క్షేత్రంలో పన్నెండు మంది ఆదిత్యులు .. పన్నెండు పేర్లతో పిలవబడుతూ వుంటారు. ఒక్కో ఆదిత్యుడి ప్రతిష్ఠ వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అలా 12 మంది ఆదిత్యులలో 'యమాదిత్యుడు' ఒకరుగా కనిపిస్తాడు. ఇక్కడి సూర్యభగవానుడిని సాక్షాత్తు యమధర్మరాజు ప్రతిష్ఠించడం వలన 'యమాదిత్యుడు' అనే పేరు వచ్చిందని అంటారు.
పూర్వం యమధర్మరాజు .. సూర్యభగవానుడి భక్తుల జోలికి పోవద్దని తన భటులతో చెప్పాడట. అయితే ఆ మాటలు వినిపంచుకోకుండా సత్రాజిత్తు దగ్గరికి వెళ్లిన యమభటులు .. సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు. దాంతో తమవారి అపరాధాన్ని మన్నించమని కోరుతూ యమధర్మరాజు కాశీ క్షేత్రంలో సూర్యభగవానుడి మూర్తిని ప్రతిష్ఠించి సూర్యోపాసన చేశాడట. అలా ఆయన ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కాశీ క్షేత్రంలోని గంగానదిలో స్నానం చేసి .. ఇక్కడి యమాదిత్యుడి దర్శనం చేసుకున్న వారికి, యమ యాతనలు .. యమలోక బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.