ఇక్కడ శ్రీరాముని పాదాల చెంత సుగ్రీవుడు కనిపిస్తాడు
శ్రీరామచంద్రుడికి .. హనుమంతుడికి గల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. శ్రీరాముని పాద ధూళినే పరమపవిత్రమైనదిగా భావించినవాడాయన. అనుక్షణం శ్రీరాముని నామస్మరణ చేస్తూ ఆయన సేవలో తరించినవాడాయన. తన వనవాస కాలంలో హనుమంతుడు చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ఆయనని శ్రీరాముడు ఆలింగనం చేసుకున్నాడు. అలాంటి శ్రీరాముడిని చూడకుండగా హనుమంతుడు క్షణ కాలమైనా వుండలేడు. అందువల్లనే ఏ ఊళ్లోని రామాలయానికి వెళ్లినా అక్కడి రాముడి పాదాల చెంత హనుమంతుడు కనిపిస్తాడు.
కానీ 'హంపి' క్షేత్రంలోని 'కోదండ రామాలయం'లో మాత్రం శ్రీరాముడి పాదాల చెంత హనుమంతుడు కాకుండా 'సుగ్రీవుడు' కనిపిస్తాడు. 'వాలి'ని సంహరించిన శ్రీరాముడు ఈ ప్రదేశంలోనే సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడట. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారి పాదాల చెంత సుగ్రీవుడు కనిపిస్తూ ఉంటాడని స్థలపురాణం చెబుతోంది. శ్రీరాముడి తల పైభాగంలో ఆదిశేషుడు పడగవిప్పి ఉండటం మరో విశేషం. ఈ క్షేత్రంలోని విరూపాక్ష ఆలయం .. విఠలేశ్వర ఆలయం .. అచ్యుతరాయ ఆలయం .. కృష్ణాలయం అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి.