శంఖు చక్రాలను ధరించిన సుబ్రహ్మణ్యుడు
భక్తుల కష్టాలను తీర్చడంలోను .. ధర్మబద్ధమైన వారి కోరికలను నెరవేర్చడంలోను సుబ్రహ్మణ్యస్వామి ఎంతమాత్రం ఆలస్యం చేయడు. అలాంటి స్వామి కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటూ .. మరికొన్ని క్షేత్రాల్లో ఉపాలయాలలో దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి ప్రధాన ఆలయాల్లో కొలువైనా .. ఉపాలయాల్లో వున్నా అందరూ కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనను కొలుస్తుంటారు. ఆ స్వామి సర్పరూపంలో వున్నా .. విగ్రహ రూపంలో వున్నా అంకితభావంతో పూజిస్తుంటారు.
సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన సర్ప దోషాలు తొలగిపోయి, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాధారణంగా సుబ్రహ్మణ్యస్వామి ఆరు ముఖాలతో .. పన్నెండు చేతులతో .. వివిధ రకాల ఆయుధాలతో దర్శనమిస్తూ ఉంటాడు. తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో గల 'అళగ పుత్తూర్' గ్రామంలోని స్వామి 'శంఖు చక్రాలు' ధరించి ఉండటం విశేషం. సుబ్రహ్మణ్యస్వామి ఇలా శంఖు చక్రాలను ధరించి ఉండటం మరెక్కడా చూడమని అంటారు. స్వామి ఇలా కొలువై ఉండటం వలన ఈ క్షేత్రం మరింత ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుంది.