అందుకే తుంగభద్రానదికి పంపానది అని పేరు
ఇటు చారిత్రక వైభవం .. అటు ఆధ్యాత్మిక వైభవం కలిగిన క్షేత్రంగా 'హంపి' కనిపిస్తుంది. ఇక్కడి విరూపాక్ష స్వామి ఆలయం అలనాటి శిల్పకళా వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందు నుంచే వున్న ఈ క్షేత్రం .. ఆ తరువాత కాలంలో మెరుగులు దిద్దుకుంటూ వచ్చింది. రామాయణ కాలంలో ఈ ప్రాంతమంతా సుగ్రీవుని రాజ్యంగా చెబుతారు. అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడి 'మాల్యవంత పర్వతం'పై కొంతకాలం వున్నాడని స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడ ప్రవహించే తుంగభద్రానది అంతకుముందు 'పంపానది'గా పిలవబడిందట. ఈ నదికి 'పంపానది'గా పేరు రావడానికి వెనుక కూడా పురాణ సంబంధమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం పార్వతీదేవి .. పంపాదేవిగా పిలువబడిందట. పంపాదేవిగా ఆమె ఈ నదీ తీరంలో శివుడి గురించి కఠోర తపస్సు చేసి ఆయనను మెప్పించి భర్తగా పొందిందట. అందువలన ఈ నదికి 'పంపానది'అనే పేరు వచ్చిందని అంటారు. పంపాదేవిని వివాహమాడిన కారణంగానే ఇక్కడి విరూపాక్ష స్వామిని 'పంపాపతి'గా కొలుస్తుంటారు.