అందుకే శివపూజలో శంఖం ఉపయోగించరట
శంఖంలో పోస్తేనేగాని తీర్థం కాదు అనే మాటను తరచూ వింటూ ఉంటాం. శంఖంలో పోసిన జలం .. అంతటి పవిత్రమైన తీర్థంగా మారిపోతుందన్న మాట. వైష్ణవ సంబంధమైన ఆలయాలలో పూజాభిషేకాలకు శంఖం తప్పకుండా వాడుతుంటారు. అయితే శివుడి పూజలో మాత్రం శంఖం వాడరు. అందుకుగల కారణంగా ఆసక్తికరమైన ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి శ్రీకృష్ణుడి ధోరణి పట్ల రాధ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉండగా, అక్కడికి సుదాముడు వస్తాడు. శ్రీకృష్ణుడి పట్ల తనకి గల ప్రేమ కారణంగా రాధని వారించడానికి ప్రయత్నిస్తాడు.
దాంతో దానవుడిగా జన్మించమని రాధ ఆయనను శపిస్తుంది. ఆ శాపం ఫలితంగా సుదాముడు .. 'శంఖచూర' అనే అసురుడిగా జన్మిస్తాడు. అసురుడైనప్పటికీ ఆయనలోని విష్ణుభక్తి అలాగే ఉంటుంది. బలగర్వంతో శంఖచూరుడు సాధుసత్పురుషులను హింసిస్తూ ఉంటాడు. వాళ్లంతా కలిసి శివుడికి మొరపెట్టుకోగా .. ఆయన శంఖచూరుడిని వధిస్తాడు. శంఖచూరుని ఎముకలతో శంఖం తయారు చేయబడుతుంది. శివుడి చేతిలో శంఖచూరుడు వధించబడటం వల్లనే ఆయన పూజలో శంఖం వాడకూడదనే మాట ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది.