పులి రూపంలో వచ్చిన పాండురంగడు
పండరీపురంలోని పాండురంగస్వామిని ఆరాధిస్తూ తరించిన భక్తులలో నామదేవుడు .. జ్ఞానదేవుడు .. తుకారామ్ .. చోఖమేళా ముందు వరుసలో కనిపిస్తారు. అలా ఆ స్వామిని సేవిస్తూ తరించిన భక్తులలో 'జగమిత్రనాగుడు' కూడా ఒకరుగా కనిపిస్తాడు. వైద్యనాథ్ కి చెందిన జగమిత్రనాగుడికి పాండురంగస్వామి సేవ తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. దాంతో ఆయన గురించి ఆ గ్రామస్థులే పట్టించుకునేవారు. వాళ్లంతా కలిసి ఆయన కోసం కొంత స్థలాన్ని కేటాయించి .. ఇంటిని నిర్మించి ఇవ్వాలనుకుంటారు.
అది నచ్చని సుబేదారు .. ఆయన భక్తిని పరీక్షించిన తరువాతనే అలా చేద్దామని అంటాడు. మరుసటి రోజు తన కూతురు పెళ్లి అనీ .. వివాహ మంటపం దగ్గర పెద్దపులిని ఉంచడం తమ ఆచారమని జగమిత్రనాగుడితో చెబుతాడు. అడవికి వెళ్లి పెద్దపులిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అడవికి వెళ్లిన జగమిత్రనాగుడు .. పాండురంగస్వామిని ప్రార్ధిస్తాడు. అంతే .. పులి రూపంలో ఆయనతో కలిసి ఊళ్లోకి పాండురంగడు వస్తాడు. ఆ దృశ్యం చూసిన సుబేదారు భయపడిపోయి .. తనని మన్నించమని జగమిత్రనాగుడిని కోరతాడు. జగమిత్రనాగుడి ఆశ్రమవాసానికి ఏర్పాట్లు చేస్తాడు.