వరాహ నరసింహస్వామిని ప్రతిష్ఠించిన పురూరవుడు
చంద్రవంశ రాజులలో పురూరవుడు ఒకరుగా కనిపిస్తాడు. తన తపశ్శక్తితో బ్రహ్మను మెప్పించిన ఆయన ఒక పుష్పక విమానాన్ని వరంగా పొందుతాడు. ఆ పుష్పక విమానంలో విహరిస్తోన్న ఆయనకి ఊర్వశి తారసపడుతుంది. ఆమె సౌందర్యాన్ని చూసిన ఆ రాజు ముగ్ధుడవుతాడు. వాళ్లిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పుష్పక విమానంలో విహరిస్తూ .. ఇప్పటి సింహాచలం ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి ప్రకృతి రమణీయతను చూసి పరవశించిపోతారు.
పూర్వం విష్ణుమూర్తి అక్కడ వరాహ నరసింహస్వామిగా ప్రహ్లాదుడికి దర్శనమిచ్చాడనే విషయం తనకి గుర్తుకొస్తుందనీ .. ఆ స్వామి కోసం అన్వేషించమని ఊర్వశి .. పురూరవుడిని కోరుతుంది. ఆ స్వామి జాడ కోసం నిద్రాహారాలు మానేసి పురూరవుడు అన్వేషించడం మొదలుపెడతాడు. ఆయన భక్తి శ్రద్ధలకి మెచ్చిన వరాహ నరసింహస్వామి స్వప్న దర్శనమిచ్చి .. తాను ఒక పుట్టలో ఉన్నాననే విషయాన్ని తెలియపరుస్తాడు. ఊర్వశి .. పురూరవులు ఆ పుట్టను కనుగొని, స్వామివారి మూర్తిని వెలికితీస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి .. అక్కడ ఆలయాన్ని నిర్మించి స్వామివారి మూర్తిని ప్రతిష్ఠిస్తారు.