బిల్వ పత్రాలను ఈ రోజుల్లో తెంపకూడదు
పరమశివుడికి బిల్వదళాలతో పూజ ఎంతో ప్రీతికరమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దోసెడు నీళ్లతో అభిషేకించి .. బిల్వ పత్రాలను సమర్పించడం వలన ఆయన ఎంతో సంతోషపడిపోతాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందువలన చాలామంది బిల్వపత్రాలతో ఆ స్వామిని పూజిస్తూ వుంటారు. అందుకోసం బిల్వ వృక్షం నుంచి పత్రాలను తెంపేసి తెచ్చేస్తుంటారు. పరమశివుడి పూజ కోసమే అయినా, బిల్వ పత్రాలను ఎప్పుడుపడితే అప్పుడు తెంపకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
సోమవారం రోజున .. చతుర్థి .. అష్టమి .. నవమి .. చతుర్దశి .. అమావాస్య తిథుల్లో బిల్వపత్రాలను తెంపకూడదనేది మహర్షుల మాట. ఈ రోజుల్లో సదాశివుడిని బిల్వపత్రాలతో పూజించాలని అనుకునేవారు, ముందురోజునే తెంపేసి పెట్టుకోవచ్చు. బిల్వ పత్రాలను ముందుగా తెచ్చుకుని .. శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టి ఆ తరువాత స్వామివారికి సమర్పించవచ్చు. ఒక్కోసారి బిల్వపత్రాలు లభించనప్పుడు .. అంతకు ముందు పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలను కడిగేసి మళ్లీ భగవంతుడికి సమర్పించవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషం ఉండదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.