శ్రీమహావిష్ణువును స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన మహాభక్తుడు
అనునిత్యం .. అనుక్షణం శ్రీమహావిష్ణువును స్మరిస్తూ తరించిన మహాభక్తులలో హరిదాస్ ఒకరు. బెంగాల్ లోని జెస్సోర్ సమీపంలో గల ఒక గ్రామంలో హరిదాస్ జన్మించారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన, ఊహ తెలిసిన నాటి నుంచి భక్తిమార్గంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎక్కడ వున్నా .. ఎక్కడ తిరుగుతూ వున్నా విష్ణునామ స్మరణ చేస్తూ ఉండేవారు. తన ప్రయాణంలో కొన్ని ఆపదలు .. అవాంతరాలు ఎదురైనా ఆయన ఎంతమాత్రం వాటిని పట్టించుకునేవారు కాదు. ఒకానొక సందర్భంలో చిత్రహింసలను అనుభవిస్తూ కూడా ఆయన హరినామ స్మరణ మానలేదు.
అలాంటి హరిదాస్ ఒకసారి పూరీ క్షేత్రానికి వెళ్లారు. తాను పుట్టిపెరిగిన వాతావరణం కారణంగా ఆయన స్వామి దర్శనం చేసుకోలేక బయటనే వుండి పోయారు. ఆ సమయంలోనే ఆయన ముందు నుంచి స్వామి దర్శనానికి చైతన్య ప్రభువు వెళ్లారు. ఆయన పాద ధూళిని తీసుకుని హరిదాస్ తన ముఖానికి రాసుకున్నారు. అది చూసిన చైతన్య ప్రభువు .. ఆయనలోని భక్తి తీవ్రతను గ్రహించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి హరినామ స్మరణ చేస్తూనే హరిదాస్ తన శరీరాన్ని విడిచిపెట్టేసి భగవంతుడిలో ఐక్యమయ్యారు.