దీర్ఘకాలిక వ్యాధులను నివారించే గురువాయురప్పన్
శ్రీకృష్ణుడు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాల్లో 'గురువాయూర్' ఒకటి. కేరళ రాష్ట్రంలోని ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయురప్పన్' గా పిలవబడుతుంటాడు .. కొలవబడుతుంటాడు. శ్రీకృష్ణుడి అవతారానికి ముందుగానే బ్రహ్మదేవుడు ఈ స్వామి మూర్తిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నుంచి తన అర్చా మూర్తిని అందుకున్న కృష్ణుడు, తన స్నేహితుడైన ఉద్ధవుడికి దానిని అందజేస్తాడు. ఆయన నుంచి ఆ మూర్తిని గ్రహించిన గురువు - వాయువు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించడం వలన ఈ క్షేత్రానికి 'గురువాయూర్' అనే పేరు వచ్చింది.
ఇక్కడి స్వామి మహిమాన్వితుడని .. మహా వైద్యుడు అని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామిని వేడుకుంటే చాలు దీర్ఘ వ్యాధులు నయమైపోతాయని నమ్ముతుంటారు . గర్భాలయంలోని మూలమూర్తిని చూస్తూ .. తాము ఏ వ్యాధితో బాధపడుతున్నది చెప్పుకుంటే చాలు .. వాటి నుంచి స్వామి విముక్తిని కలిగిస్తాడని చెబుతారు. అలా వివిధ రకాల వ్యాధుల నుంచి బయటపడిన భక్తులను గురించి కథలుకథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఈ కారణంగానే వ్యాధులతో బాధపడే వాళ్లు స్వామివారిని దర్శించుకుకోవడానికి ఎంతో దూరంనుంచి వస్తుంటారు. ఆయన దర్శనభాగ్యంతో ధన్యులవుతుంటారు.