అమ్మవారి వామ నేత్రం పడిన ప్రదేశమే నైనితాల్

భారతదేశంలోని 52 శక్తిపీఠాలలో 'నైనితాల్' ఒకటిగా కనిపిస్తుంది. దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవి తండ్రి చేత అవమానించబడుతుంది. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో తన ప్రాణాలు వదులుతుంది. ఆమె పార్థివ శరీరాన్ని భుజాన మోసుకుంటూ శివుడు తిరుగుతుంటాడు. ఆయనని ఆ మోహంలో నుంచి విముక్తుడిని చేయడానికిగాను సతీదేవి శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు విష్ణుమూర్తి. అప్పుడు ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా అవతరించాయి.

అలా సతీదేవి దక్షిణ నేత్రం మదురైలో పడిన కారణంగా అమ్మవారు మీనాక్షిదేవిగా పూజలు అందుకుంటోంది. ఆ తల్లి వామ నేత్రం పడిన ప్రదేశం 'నైనితాల్' గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అమ్మవారిని 'నైనాదేవి'గా భక్తులు పూజిస్తూ వుంటారు. ఈ ప్రదేశంలో పడిన అమ్మవారి వామ నేత్రం సరోవరంగా మారిందని అంటారు. అందుకే ఈ సరోవరాన్ని 'నైనీ సరోవరం'గా పిలుస్తుంటారు. అమ్మవారి నేత్రం పడిన క్షేత్రం కనుక, ఆ తల్లి చల్లగా చూస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహం కారణంగా తమ మనసులోని కోరికలు నెరవేరినప్పుడు, తమ శక్తి కొలది అమ్మవారికి వెండి .. బంగారంతో చేయించిన నేత్రాలను సమర్పిస్తూ వుంటారు. 


More Bhakti News