అహంభావం అనర్థాలకు దారితీస్తుంది
ఎవరికి వారు తమకి ఏ మాత్రం అహంభావం లేదనీ .. ఎదుటివారికి అహంభావం చాలా ఎక్కువగా ఉందని అనుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అహంభావం ఎవరికి వున్నా అది అనార్థాలకే దారితీస్తుంది. అహంభావాన్ని ప్రదర్శించి ప్రయోజనాన్ని పొందిన వాళ్లంటూ ఎవరూ లేరు. అహంభావం కష్టనష్టాలను తెచ్చిపెడుతుంది .. ఒక్కోసారి ప్రాణాల మీదకి కూడా తెస్తుంది. అందుకు ఉదాహరణగా పరీక్షిత్తు మహారాజు కథ మనకి కనిపిస్తుంది.
'కలి' పురుషుడు బంగారంలో ఉండటానికి అవకాశం ఇచ్చిన పరీక్షిత్తు, ఆ విషయాన్ని మరిచిపోయి స్వర్ణ కిరీటాన్ని ధరించి వేటకు వెళతాడు. కలి పురుషుడి ప్రభావం కారణంగా పరీక్షిత్తులో అహంభావం ప్రవేశిస్తుంది. అడవిలో వేటాడుతోన్న ఆయనకి దాహం వేస్తుంది. దాహం తీర్చుకోవడానికి గాను జలాశయం కోసం వెతుకుతోన్న ఆయనకి, ధ్యానంలో వున్న శమీక మహర్షి కనిపిస్తాడు. తన దాహం తీర్చవలసిందిగా శమీక మహర్షిని అడుగుతాడు పరీక్షిత్తు. ధ్యానంలో వున్న ఆయన పలకకపోవడంతో పరీక్షిత్తుకు కోపం వచ్చేస్తుంది. దాంతో ఆయన ఆ పక్కనే పడున్న చనిపోయిన పామును కర్రతో తీసి శమీకుడి మేడలో వేసి వెళ్లిపోతాడు. ఈ విషయం శమీకుడి పుత్రుడైన 'శృంగి'కి తెలుస్తుంది. అహంభావంతో తన తండ్రిని అవమానపరిచిన రాజు, నేటికి ఏడవరోజున పాము కాటుతో మరణించుగాక అని శపిస్తాడు. అలా అహంభావంతో పరీక్షిత్తు సత్పురుషుల శాపానికి గురికావలసి వస్తుంది.