అష్టకష్టాలంటే ఇవే
జీవితంలో కష్టాలనేవి ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిపడుతుంటాయి. అలాంటప్పుడు వాటిని తట్టుకుంటూనే ముందుకు వెళుతుండటం చేస్తుంటాం. ఇక ఒక్కోసారి కష్టాలన్నీ ఒకేసారిగా వచ్చి మీదపడుతుంటాయి. అలాంటప్పుడు వాటిని ఎదిరించి నిలవడం మరింత కష్టమవుతుంది. కష్టాలనేవి సహనాన్ని పరీక్షిస్తూ కుదిపేస్తూ ఉంటాయి .. జీవితంపై నిరాశా నిస్పృహలను కలిగిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పలకరిస్తే, 'అష్టకష్టాలు పడుతున్నాం' అని అంటూ ఉంటాం.
అష్టకష్టాలనేవి ఏమిటో తెలియకుండానే ఈ మాటను అనేస్తూ ఉండటం జరుగుతుంటుంది. అష్టకష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలు. ఈ ఎనిమిది రకాల కష్టాలను ఏక కాలంలో అనుభవించే పరిస్థితులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అప్పులపాలు కావడం .. ఇతరులను యాచించవలసి రావడం .. పేదరికం అనుభవిస్తూ ఉండటం .. ఎంగిలి అన్నం తినవలసి రావడం .. దొంగతనం చేయవలసి రావడం .. రోగంతో యాతన పడుతుండటం .. వృద్ధాప్యం .. భార్యా వియోగంతో బాధపడుతూ ఉండటం అష్టకష్టాలుగా చెప్పబడుతున్నాయి. ఎంతటి కష్టమైనా భగవంతుడి అనుగ్రహంతో తీరిపోతుంది .. అందుకు అనునిత్యం ఇష్టదేవతారాధన చేయవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.