నరక బాధలు లేకుండగా చేసే కృష్ణ నామస్మరణ
జీవితంలో తెలిసో .. తెలియకో చేసే కొన్ని పనుల వలన పాపాలు ఖాతాలోకి చేరిపోతుంటాయి. ఎవరి పాపాలు వాళ్ల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. ఇక కొన్ని పాపాలు జన్మజన్మల పాటు వెంటాడుతూ ఉంటాయి. ఈ కారణంగా కూడా అనేక బాధలు .. కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్ధికంగా .. ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో సతమతం చేస్తుంటాయి. చేసిన పాపాల ఫలితంగా .. పాపాలకి తగిన శిక్షలను నరకంలో అనుభవించవలసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
నరకలోకంలో జీవుడు అనుభవించే బాధలు అన్నీ ఇన్నీ కావు .. అందువలన పాపాల నుంచి విముక్తిని పొందే మార్గమేదైనా ఉందా అని పరాశర మహర్షిని మైత్రేయుడు అడుగుతాడు. సమస్త పాపాల నుంచి విముక్తిని కలిగించేది కృష్ణ నామస్మరణమని పరాశర మహర్షి చెబుతాడు. అందువలన అనునిత్యం శ్రీకృష్ణుడి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఏ మాత్రం సమయం దొరికినా ఆ స్వామి క్షేత్రాలకి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఇక శరీరం సహకరించనివారు శ్రీకృష్ణుడి లీలా విశేషాలను తలచుకుని అనుభూతిని చెందాలి. శ్రీకృష్ణుడిని ఆరాధించి తరించిన భక్తుల జీవితచరిత్రలు చదువుకోవాలి .. ఆ స్వామి పాదాల చెంత మనసును సమర్పించాలి. జీవితంలో ఒక్కసారైనా మథుర .. బృందావనం .. ద్వారక క్షేత్రాలను దర్శించి .. స్పర్శించి తరించాలి.