అదే కురుక్షేత్రం విశిష్టత

'కురుక్షేత్రం' అనే పేరు వినగానే పాండవులకు .. కౌరవులకు జరిగిన యుద్ధం గుర్తుకు వస్తుంది. అలాంటి ఈ యుద్ధభూమి ఎంతో ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకున్నదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కురువంశ మూలపురుషుడైన 'కురువు' పేరు మీద ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు. తన పేరుమీద ప్రసిద్ధి చెందే ఈ ప్రదేశం పుణ్యభూమిగా వర్ధిల్లాలనీ .. ఎంతటి పాపాలు చేసిన వారైనా ఈ ప్రదేశంలో చనిపోతే వారికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని 'కురువు' దేవేంద్రుడిని కోరగా .. అందుకు దేవేంద్రుడు అనుగ్రహించాడని స్థలపురాణం.

'కురుక్షేత్రం' కంటే ముందు ఈ ప్రాంతాన్ని 'బ్రహ్మావర్త' అని పిలిచేవారట. బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో యజ్ఞం చేశాడని కూడా అంటారు. వ్యాస మహర్షి ఈ తపోభూమిలోనే పురాణాలను రచించాడని చెబుతారు. 'కురుక్షేత్రం'లోనే అర్జునుడికి కృష్ణపరమాత్ముడు గీతోపదేశం చేశాడు. 'అంపశయ్య'పై వున్న భీష్ముడు 'విష్ణు సహస్రనామాలు' చెప్పాడు. ఇలా 'కురుక్షేత్రం' ధర్మక్షేత్రంగా .. తపోభూమిగా ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.  


More Bhakti News