అష్ట వినాయక క్షేత్రాలు ఇవే
ఏ శుభకార్యమైనా గణపతి పూజతోనే మొదలవుతుంది. వినాయకుడిని పూజించకుండా .. ప్రార్ధించకుండా ఎవరూ కూడా ఏ పనిని ప్రారంభించరు. శుభాలను .. లాభాలను చేకూర్చేది వినాయకుడేననే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎవరైనా సరే జీవితంలో ముందుకు వెళ్లాలంటే కార్యసిద్ధి కలగాలి. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించేది వినాయకుడే కనుక, వేదకాలం నుంచి ఆ స్వామిని పూజించడమనేది జరుగుతూ వస్తోంది. అలాంటి వినాయకుడి జన్మతిథి .. భాద్రపద శుద్ధ చవితి. అందువలన ఆ రోజుని 'వినాయక చవితి'గా జరుపుకుంటూ ఉంటారు .. ఈ రోజున 21 రకాల పత్రులతో స్వామివారిని పూజిస్తూ వుంటారు.
వినాయకుడు కొలువైన క్షేత్రాలలో 'అష్ట వినాకయక క్షేత్రాలు' మరింత ప్రసిద్ధి చెందినవిగా కనిపిస్తాయి. ఈ క్షేత్రాలన్నీ కూడా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉండటం విశేషం. బారామతి తాలూకాలోని 'మోర్ గావ్' లో వినాయకుడు 'మయూరేశ్వరుడు'గా .. 'పాలి'లోని వినాయకుడు 'బల్లాలేశ్వరుడు'గా పిలవబడుతున్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని శ్రీగొండలో 'సిద్ధి వినాయకుడు' .. మహద్ క్షేత్రంలో 'వరద వినాయకుడు' భక్తులకు దర్శనమిస్తుంటారు. 'ధేవూర్'లో 'చింతామణి గణపతి'గా .. 'ఓఝార్'లో 'విఘ్నహార్'గా స్వామి పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక 'లేన్యాద్రి'లో గిరిజాత్మజ్ వినాయక్ గా .. 'రంజన్ గావ్'లో 'మహాగణపతి'గా స్వామి కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు. ఈ అష్ట గణపతి క్షేత్రాలను దర్శించడం వలన సమస్త దోషాలు నశించి .. సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.