ఈ గణపతిని పూజించాకే దుష్యంతుడిని శకుంతల కలుసుకుందట
వినాయకుడు ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటి మహారాష్ట్ర .. 'థానే' జిల్లాలోని 'టిట్వాలా' నగరంలో దర్శనమిస్తుంది. ఇక్కడి గణపతికి ఒక ప్రత్యేకత వుంది. విడిపోయిన భార్యాభర్తలలో ఏ ఒక్కరూ ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్నా, ఆ తరువాత వాళ్లు కలిసి జీవిస్తారట. ఈ నమ్మకం వెనుక ఒక బలమైన కథ వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి వేటకి వచ్చిన దుష్యంతుడు .. శకుంతలను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని, ఆ తరువాత అంతఃపురానికి తీసుకువెళతానని చెప్పి వెళతాడు.
దూర్వాసుడి శాపం కారణంగా ఆయన శకుంతల విషయాన్ని మరిచిపోతాడు. దాంతో నిద్రాహారాలు మానేసిన శకుంతల .. కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉంటుంది. ఆ బాధను చూసిన కణ్వ మహర్షి .. వినాయకుడిని పూజించడం వలన మనసు కుదుట పడుతుందని చెప్పి .. వరసిద్ధి వినాయకస్వామిని ప్రతిష్ఠిస్తాడు. ఆ గణపతిని అనునిత్యం పూజించిన శకుంతల, ఆటంకాలు తొలగిపోయి దుష్యంతుడిని చేరుకుంటుంది. 'టిట్వాలా'లోని గణపతి మూర్తి .. శకుంతలచే పూజలు అందుకున్నదేనని అంటారు. ఈ స్వామి దర్శనం వలన దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి .. అన్యోన్యంగా ఉంటారని విశ్వసిస్తూ వుంటారు.