అందుకే ఇక్కడి శివయ్యకు కోటీశ్వరుడు అని పేరు
పరమశివుడు కొలువైన పరమపవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో 'కోటిపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించి పూజించాడని స్థలపురాణం చెబుతోంది. అహల్యను మోహించిన దేవేంద్రుడు .. కోడి రూపంలో కూసి .. నదీ స్నానానికి గౌతమ మహర్షి వెళ్లేలా చేస్తాడు. మహర్షి అలా వెళ్లగానే ఆయన రూపంలో ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. దివ్యదృష్టితో విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి .. దేవేంద్రుడిని శపిస్తాడు.
శరణు కోరిన దేవేంద్రుడితో .. ఒకే సమయంలో కోటి శివలింగాలను ప్రతిష్ఠిస్తే శాపవిమోచనమవుతుందని చెబుతాడు. అది అసాధ్యమనీ .. మరో మార్గమేదైనా వుంటే సెలవీయమని దేవేంద్రుడు కోరతాడు. గౌతమీ నదీ తీరంలో అంతర్వాహినిగా కోటి నదులు ప్రవహిస్తున్నాయనీ, అందువలన అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని సెలవిస్తాడు. కోటి శివలింగాలను ప్రతిష్ఠించిన ఫలితాన్ని ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవేంద్రుడు పొందాడు. దేవేంద్రుడికి కోటిరెట్ల ఫలితాన్ని ఇచ్చిన కారణంగా ఇక్కడి శివయ్యని 'కోటీశ్వరుడు' అంటారు. ఈ స్వామి పేరు మీదనే ఈ క్షేత్రానికి 'కోటిపల్లి' అనే పేరు వచ్చిందని చెబుతారు.