భక్తజన రక్షకుడే భగవంతుడు
భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటాడు. ధర్మబద్ధమైన .. న్యాయ బద్ధమైన వారి అవసరాలను తీరుస్తూ, ఆపదల నుంచి .. ప్రమాదాల నుంచి వాళ్లని కాపాడుతూ ఉంటాడు. సాధు జీవనాన్ని గడిపే తన భక్తులకి హాని తలపెట్టడానికి ఎవరు ప్రయత్నించినా ఆయన ఎంతమాత్రం సహించడు. అందుకు ఉదాహరణగా విష్ణుభక్తుడైన అంబరీషుడి జీవితంలోని ఒక సంఘటన కనిపిస్తుంది.
ప్రతి ఏడాదిలానే ఆ ఏడాది కూడా అంబరీషుడు 'ద్వాదశీ వ్రతం' ఆచరిస్తాడు. ఈ వ్రతం ఆచరించేవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి .. ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భోజనం చేయాలి. ఆ వ్రతాన్ని ఆయన పూర్తిచేస్తుండగా దూర్వాసుడు అక్కడికి వస్తాడు. త్వరగా స్నానం చేసి తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా దూర్వాసుడిని అంబరీషుడు కోరతాడు. నదీ స్నానానికి వెళ్లిన దూర్వాసుడు ఎంతకీ రాకపోవడంతో, ద్వాదశీ ఘడియలు మించిపోతున్నాయనే ఉద్దేశంతో వ్రతభంగం కాకుండా అంబరీషుడు కొంచెం నీరు మాత్రం తీసుకుంటాడు.
అంతలో అక్కడికి వచ్చిన దూర్వాసుడు 'నువ్వు సేవించినది జలమే అయినా .. అది భోజనంతో సమానమే' అంటూ ఆగ్రహిస్తాడు. తనని భోజనానికి పిలిచి అవమానపరిచావంటూ ఎడమకాలుతో తన్ని .. పది నీచ జన్మలు ఎత్తమని అంబరీషుడిని శపిస్తాడు. క్షమించమని అంబరీషుడు అంటున్నా వినిపించుకోకుండా మరో శాపం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన భక్తుడిని రక్షించుకోవడానికి శ్రీమహావిష్ణువు 'సుదర్శన చక్రం' వదులుతాడు. సుదర్శన చక్రం బారి నుంచి తనని రక్షించే శక్తి ఎవరికీ లేదని తెలిసిన దూర్వాసుడు, శ్రీమహావిష్ణువు పాదాలనే ఆశ్రయిస్తాడు. అంబరీషుడినే శరణు వేడుకోమని స్వామి చెప్పడంతో, దూర్వాసుడు అక్కడికే పరిగెడతాడు. అప్పడు అంబరీషుడు .. దూర్వాసుడిని మన్నించి వదిలేయమని కోరడంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది.