అదే గరుడ వాహన సేవ ప్రత్యేకత
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కనుల పండుగగా జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు 'పెద్ద శేష వాహనం' .. 'చిన్న శేష వాహనం' .. 'సూర్యప్రభ వాహనం' .. చంద్రప్రభ వాహనం' .. ముత్యాల పందిరి వాహనం' .. ' హంస వాహనం' .. ' సింహ వాహనం' .. గజ వాహనం' .. 'అశ్వ వాహనం' .. 'గరుడ వాహనం' . 'హనుమంత వాహనం'.. 'రథం'పై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు.
ఒక్కో వాహన సేవలో భక్తులు పాల్గొంటూ తరిస్తుంటారు. అన్ని వాహన సేవల్లోను 'గరుడవాహన సేవ' మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సాక్షాత్తు మూలమూర్తికి ధరింపజేసే 'మకరకంఠి' .. ' సహస్రనామ హారం'తో పాటు 'మేల్ చాట్' పట్టుబట్టలను గరుడవాహన సేవలో ఉపయోగిస్తారు. స్వామివారి ఆభరణాలను గర్భాలయం బయటికి తీసుకొచ్చి వాహన సేవలో ఉపయోగించడం ఒక్క 'గరుడవాహన సేవ' రోజు మాత్రమే జరుగుతుంది. గరుడ వాహనంపై వచ్చే స్వామివారిని తిలకిస్తూ భక్తులు తమని తాము మరిచిపోతుంటారు .. ఆనంద బాష్పాలతో గోవిందుడి నామ స్మరణ చేస్తుంటారు.