అన్నమయ్య ఇక్కడి శ్రీరాముడిపై కీర్తనలు రాశారు
తిరుమల శ్రీనివాసుడిపై .. నరసింహస్వామిపై అన్నమయ్య అనేక కీర్తనలు రాసినట్టుగా చెబుతారు. అనేక క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడ ఆవిర్భవించిన దేవతా స్వరూపాలపై కూడా కీర్తనలు రాసి తన్మయత్వంతో పాడుతూ ప్రచారం చేశారు. అలా అన్నమయ్య 'వాయల్పాడు' ప్రతాప రాముడుపై కూడా కీర్తనలు రాసినట్టుగా స్థల పురాణం చెబుతోంది. చిత్తూరు జిల్లాలోని 'వాయల్పాడు' ఒకప్పుడు 'బోయలు' నివసించడం వలన 'బోయుల పాడు'గా పిలవబడుతూ ఉండేదట. కాలక్రమంలో అది కాస్త 'వాయల్పాడు'గా మారింది.
ఇక్కడి స్వామివారి మూర్తి పుట్ట (వల్మీకం)లో నుంచి బయటపడటం వలన 'వాల్మీకీ పురం' అని కూడా పిలుస్తుంటారు. ఈ క్షేత్రంలో హనుమ సమేతుడైన సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నల మూర్తులను జాంబవంతుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. సీతమ్మవారి జన్మ నక్షత్రంగా చెప్పబడే 'ఆశ్లేష ' నక్షత్రం రోజున ఇక్కడ కల్యాణోత్సవం జరపడం విశేషం. ఇక్కడి సీతారాములను దర్శించుకోవడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.