సత్య హరిశ్చంద్రుడు ఆచరించిన అజ ఏకాదశి వ్రతం
ప్రతి ఏడాదిలోను 24 ఏకాదశులు వస్తుంటాయి. ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేపట్టి, శ్రీమహావిష్ణువును ఆరాధించడం వలన అనేక విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి ఏకాదశులతో ఒకటిగా 'అజ ఏకాదశి' కనిపిస్తుంది.
భాద్రపద బహుళ ఏకాదశికే 'అజ ఏకాదశి' అని పేరు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త కష్టాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. పూర్వం సత్య ధర్మాలను ఆశ్రయించిన 'సత్య హరిశ్చంద్రుడు'.. అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటాడు. ఆ తరువాత ఆయన 'అజ ఏకాదశి' వ్రతాన్ని ఆచరించి, తన భార్య బిడ్డలతోపాటు రాజ్యాన్ని కూడా తిరిగి పొందాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన భాద్రపద బహుళ ఏకాదశి రోజున 'అజ ఏకాదశి' వ్రతాన్ని ఆచరించే అవకాశాన్ని వదులుకోకూడదు.