గోమాతకు ఆహారాన్ని సమకూర్చితే చాలు
సకల దేవతా స్వరూపమే గోవు అనీ .. గోవును పూజించడం వలన సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. యజ్ఞయాగాదులు చేసే ప్రదేశాన్ని గోమయంతో శుభ్రం చేస్తారు. భగవంతుడికి చేసే పంచామృత అభిషేకంలో ఆవు పాలు .. ఆవు పెరుగు .. ఆవు నెయ్యి కనిపిస్తాయి. దీనిని బట్టి గోవు ఎంత పవిత్రమైనదనే విషయం అర్థం చేసుకోవచ్చు. అలాంటి గోవుకు ఆహారాన్ని అందించడం వలన అనేక పుణ్య ఫలాలు లభిస్తాయి. గోవుకు ఒక్కో ఆహారాన్ని అందించడం వలన ఒక్కో ఫలితం లభిస్తూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
నానబెట్టిన 'బొబ్బర్లు' గోమాతకి పెట్టడం వలన ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. నానబెట్టిన 'గోధుమలు' గోవుకు పెట్టడం వలన పేరు ప్రతిష్ఠలు పొందుతారు. నీటితో మెత్తగా చేయబడిన రాగిపిండికి బెల్లాన్ని జోడించి గోవుకి పెట్టడం వలన దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. నానబెట్టిన 'శనగలు' గోవుకి పెట్టడం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నానబెట్టిన 'పెసలు' గోవుకు పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. నరఘోష కారణంగా నానా ఇబ్బందులు పడేవాళ్లు .. ఉడికించిన బంగాళా దుంపలను గోవుకు పెట్టవలసి ఉంటుంది. ఇక అప్పుల బాధలతో సతమతమైపోయేవాళ్లు నానబెట్టిన 'కందిపప్పు'ను గోవుకు తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన రుణ విముక్తి కలుగుతుంది.