కలి పురుషుడి బారి నుంచి ఇలా బయటపడొచ్చునట
కలియుగంలో 'కలి' పురుషుడి ప్రభావం ఉంటుంది. ధర్మ మార్గంలో జీవితాన్ని కొనసాగించేవారి జోలికి .. దురలవాట్లకు దూరంగా ఉండేవారికి .. ఆచార వ్యవహారాలను పాటించేవారి జోలికి వెళ్లవద్దని 'కలి'కి బ్రహ్మదేవుడు చెబుతాడు. అందుకు తగినట్టుగానే 'కలి' తన ప్రభావం చూపుతూ వస్తున్నాడు. 'కలి' పురుషుడి బారిన పడినవాళ్లు నానా కష్టనష్టాలను .. బాధలను అనుభవిస్తారు. అందుకు ఉదాహరణగా మనకి 'నల మహారాజు' జీవిత చరిత్ర కనిపిస్తుంది.
ఒకసారి ఆయన తొందరలో తాను శుచిగాలేననే విషయం మరిచిపోయి సూర్య నమస్కారం చేయడం వలన, ఆయనలో 'కలి' పురుషుడు ప్రవేశిస్తాడు. దాంతో ఆయన జూదమాడి రాజ్యాన్ని కోల్పోతాడు. భార్య దమయంతికి .. బిడ్డలకు దూరమైపోతాడు. 'కర్కోటకుడు' అనే పాము కాటు వేయడం వలన వికృత రూపాన్ని పొంది నానా బాధలను అనుభవిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో 'ఋతు పర్ణుడు' అనే రాజు నుంచి 'అక్ష హృదయ' మంత్రాన్ని స్వీకరించడం వలన, ఆ మంత్ర ప్రభావానికి తట్టుకోలేక నలుడి శరీరంలో నుంచి 'కలి' పురుషుడు బయటికి వచ్చేస్తాడు. తనని శపించవద్దని కలిపురుషుడు నలుడిని కోరతాడు. ఎవరైతే నలుడిని .. దమయంతిని .. కర్కోటకుడిని .. ఋతుపర్ణుడిని తలచుకుంటారో వారి జోలికి తాను వెళ్లనని మాట ఇస్తాడు. అందువలన కలి పురుషుడు దరిచేరకూడదు అనుకునేవారు, పై నలుగురిని తలుచుకోవడం మరిచిపోకూడదు.