ఒక్కో రోజు ఒక్కో పేరుతో ఆరాధించబడే బతుకమ్మ
తెలంగాణ ప్రాంతంలో స్త్రీలంతా కలిసి జరుపుకునే విశేషమైన పండుగలలో 'బతుకమ్మ' పండుగ ఒకటి. కాకతీయుల కాలం నుంచి ఈ పండుగను జరుపుతున్నట్టుగా చరిత్ర చెబుతోంది. గుమ్మడి ఆకులు .. తంగేడు పూలు .. గునుగు పూలు .. బంతి .. చామంతి .. ఎర్ర రుద్రాక్ష .. బీరపూలతో బతుకమ్మలను పేరుస్తుంటారు. ఈ రోజున మొదలయ్యే ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు ఎంతో సందడిగా .. సంతోషకరంగా జరుగుతుంది.
ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక బతుకమ్మను పేరుస్తూ ఒక్కో పేరుతో పూజిస్తూ నైవేద్యాలు సమర్పిస్తుంటారు. తొలిరోజున 'ఎంగిలిపువ్వు బతుకమ్మ'ను .. రెండవ రోజున 'అటుకుల బతుకమ్మ'ను .. మూడవ రోజున 'ముద్దపప్పు బతుకమ్మ'ను .. నాల్గొవ రోజున 'నాన బియ్యం బతుకమ్మ'ను .. అయిదవ రోజున 'అట్ల బతుకమ్మ'ను .. ఆరో రోజున 'అలిగిన బతుకమ్మ'ను .. ఏడో రోజున 'వేపకాయల బతుకమ్మ'ను .. ఎనిమిదవ రోజున 'వెన్న ముద్దల బతుకమ్మ'ను .. తొమ్మిదవ రోజున 'సద్దుల బతుకమ్మ'ను పేర్చి ఆరాధిస్తారు. సాక్షాత్తు జగన్మాతయైన అమ్మవారిని ఈ విధంగా పూజించడం వలన, సకల సౌభాగ్యాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు.