నవరాత్రుల్లో అమ్మవారి నైవేద్యాలు
దసరా నవరాత్రులలో ప్రతి ఊళ్లోను అమ్మవారి ఆలయాలు భక్తుల రద్దీతో ఎంతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజిస్తూ .. ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తూ వుంటారు. అలా తొలి రోజున 'స్వర్ణకవచ దుర్గాదేవి'గా అమ్మవారిని అలంకరించి 'కట్టుపొంగలి'ని నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజున 'బాలా త్రిపురసుందరి'గా అమ్మవారిని అలంకరించి 'పులిహోర' నైవేద్యంగా పెడతారు. మూడవ రోజున 'గాయత్రి దేవి'గా అలంకరించి 'కొబ్బరి అన్నం' నైవేద్యంగా సమర్పించాలి.
నాల్గొవ రోజున 'అన్నపూర్ణ దేవి'గా అలంకరించి 'అల్లం గారెలు' నైవేద్యంగా పెట్టాలి. అయిదో రోజున 'లలితా త్రిపురసుందరి దేవి'గా అమ్మవారిని అలంకరించి 'రవ్వకేసరి' నివేదన చేయాలి. ఆరో రోజున 'శ్రీ మహాలక్ష్మీదేవి'గా అలంకరించి 'కాయగూరలతో కూడిన అన్నం' నైవేద్యంగా పెట్టాలి. ఏడో రోజున 'సరస్వతి దేవి'గా అలంకరించి 'దధ్యోదనం' నివేదన చేయాలి. ఎనిమిదవ రోజున 'దుర్గాదేవి'గా అలంకరించి 'చక్కెర పొంగలి' నైవేద్యంగాపెట్టాలి. తొమ్మిదో రోజు 'మహిషాసుర మర్దని'గా అలంకరించి 'శనగపిండి గారెలు .. పేలాలు' నైవేద్యంగా సమర్పించాలి. పదో రోజున 'శ్రీ రాజరాజేశ్వరి దేవి'గా అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారికి 'లడ్డూలు' నివేదన చేయాలి. ఈ విధంగా ఆ తల్లిని ఆరాధించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.