బ్రహ్మోత్సవాల్లో స్వామివారి రథోత్సవం చూడాల్సిందే
తిరుమలలో జరిగే శ్రీవారి 'బ్రహ్మోత్సవాలు' చూడటానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి అని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. అంతటి అంగరంగ వైభవంగా ఆ స్వామికి 'బ్రహ్మోత్సవాలు' జరుగుతూ ఉంటాయి. స్వామివారు ఒక్కోరోజు .. ఒక్కో వాహనంపై తరలి వస్తుంటే ఆనంద బాష్పాలను వర్షించని కన్నులుండవు. ఈ జన్మకి ఇది చాలు అనుకోని మనసు ఉండదు. అంతగా అక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లబడుతూ ఉంటాయి.
బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రథంపై ఊరేగడం చూస్తుంటే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజున 'రథోత్సవం' జరుగుతుంది. నాలుగు గుర్రాలు పూన్చిన రథంపై స్వామివారు ఊరేగుతూ నయనానందాన్ని కలిగిస్తాడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవాలకు ముందు ప్రతి రోజు ఉదయం .. సాయంత్రం వేళల్లో 'బ్రహ్మరథం' వెళుతూ వుంటుంది. ఒక్క 'రథోత్సవం' రోజున మాత్రం 'బ్రహ్మరథం' వుండదు. 'రథోత్సవం' రోజున శ్రీవారు ఆశీనుడైన రథం యొక్క పగ్గాలను బ్రహ్మదేవుడు పట్టుకుని లాగుతూ ఈ ఉత్సవంలో పాల్గొంటాడు. అందుకే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది.