విజయాలను ప్రసాదించే రాజరాజేశ్వరీదేవి
లోక కల్యాణం కోసం అమ్మవారు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించింది. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం అమ్మవారు అనేక ప్రదేశాల్లో కొలువైంది. వివిధ రూపాలలో కొలువైన ఆ తల్లి .. వివిధ నామాలతో పూజించబడుతోంది. అలా అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా కొలువైన క్షేత్రం మనకి కడప జిల్లా 'ప్రొద్దుటూరు'లో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో ఇక్కడి అమ్మవారి ఆలయం అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతతకు ప్రతీకగా అనిపిస్తూ ఉంటుంది.
గర్భాలయంలో అమ్మవారు ప్రసన్న వదనంతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ప్రతి మంగళ .. శుక్రవారాల్లో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి రాజరాజేశ్వరీ దేవిని పూజించడం వలన .. దర్శించుకోవడం వలన సకల సౌభాగ్యాలు లభిస్తాయని అంటారు. తలపెట్టిన కార్యాలు ఏలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయి .. విజయాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.