శివుడి కోసం రావణుడు తపస్సు చేసినది ఇక్కడేనట
రావణుడు మహా శివభక్తుడు .. అనునిత్యం శివుడికి పూజాభిషేకాలు నిర్వహించిన తరువాతనే ఆయన ఏదైనా ఆహారంగా తీసుకునేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన ఆరాధన కొనసాగేది. అలాంటి రావణుడు .. కైలాసంలోని పరమ శివుడిని లంకా నగరానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడట. సదాశివుడు లంకా నగరంలో కొలువై వుంటే తనకి ఎదురే ఉండదని భావించి, ఆ స్వామి సాక్షాత్కారం కోసం కఠోర తపస్సు చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అలా రావణుడు తపస్సు ఆచరించిన ప్రదేశమే 'రాక్షస తాల్' అని అంటారు. 'మానస సరోవరం' పశ్చిమాన 'రాక్షస తాల్' ఉంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికిగాను .. రావణుడు ఈ సరస్సు మధ్యలో నిలబడి కఠోర తపస్సు చేశాడట. అందువల్లనే ఈ సరస్సును 'రాక్షస తాల్' అనీ .. 'రావణ సరోవరం' అని పిలుస్తుంటారు. రావణుడి తపస్సుకి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షం కావడం .. ఎలాంటి పరిస్థితుల్లోను కింద పెట్టకూడదంటూ 'ఆత్మలింగం' ఇవ్వడం .. ఆత్మలింగంతో లంకా నగరానికి బయలుదేరిన రావణుడికి పశువుల కాపరి వేషంలో వినాయకుడు తారసపడటం .. రావణుడు సంధ్యావందనం చేసుకుని వచ్చేలోగా వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని కిందపెట్టేయడం గురించి తెలిసిందే.