దీపావళి రోజున లక్ష్మీదేవి ఆరాధన ఫలితం

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం .. దీపాల హారంతో ఈ రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుండటం అనాదిగా వస్తోంది. దీపావళి రోజున అంతా కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి .. తలస్నానం చేయాలి. ఈ రోజు ఉదయాన చేసే తలస్నానం .. 'గంగ'లో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుందనేది మహర్షుల మాట. చాలామంది పగలంతా ఉపవాస దీక్షను చేపట్టి, సాయంత్రం వేళలో లక్ష్మీదేవికి పూజ చేస్తుంటారు.

ఈ రోజున రాత్రి వేళలో లక్ష్మీదేవి భూలోకంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందట. తనని పూజించేవారిని అనుగ్రహించడం కోసమే అమ్మవారు ఈ ప్రయాణం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పగిలిపోయిన .. పాడైపోయిన వస్తువులు వున్న ఇళ్లలోకి, పరిశుభ్రత .. పవిత్రత లేని ఇళ్లలోకి రావడానికి లక్ష్మీదేవి ఆసక్తిని చూపదట. అందువలన ముందుగానే అలాంటి వస్తువులను అవతల పారేసి .. ఇంటిని పరిశుభ్రంగా .. పవిత్రంగా ఉంచాలి. ఏ ఇంటి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టి .. వరుస దీపాలు వెలుగుతూ వుంటాయో, ఏ ఇంటి నుంచి తన నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట ఉండటానికే అమ్మవారు ఇష్టపడుతుంది. ఆ తల్లి ప్రీతి చెందితే సంపదలు వాటంతటవే చేకూరతాయి.     


More Bhakti News