భగినీ హస్త భోజనం విశిష్టత
చాంద్రమానాన్ని అనుసరించి కార్తిక మాసం .. ఎనిమిదవ మాసం. ఈ మాసానికి 'కౌముది' మాసం అనే పేరు కూడా వుంది. ఈ మాసంలో ప్రతి రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తిక శుద్ధ పాడ్యమికి 'బలి పాడ్యమి' అని పేరు. ఈ రోజున 'బలి చక్రవర్తి'ని పూజించి, శక్తి కొలది దానాలు చేయడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక కార్తిక శుద్ధ విదియ .. 'భగినీ హస్త భోజనం' రోజుగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజునే 'యమ ద్వితీయ' .. 'భాతృ విదియ' అని కూడా పిలుస్తుంటారు.
ఈ రోజునే తన అన్నయైన యమధర్మరాజుని యమున ఆహ్వానించి, స్వయంగా వంటచేసి భోజనం పెట్టిందట. సంతృప్తి చెందిన యమధర్మరాజు సంతోషంతో ' ఈ రోజున స్త్రీలు తమ సోదరులను ఆహ్వానించి ఆత్మీయంగా భోజనం పెట్టాలనీ, ఈ విధంగా చేయడం వలన ఆ స్త్రీల సౌభాగ్యం నిలుస్తుందని వరం ఇచ్చాడట. అంతేకాదు .. ఎవరైతే ఈ రోజున తమ సోదరి ఇంటికి వెళ్లి వారి చేత వడ్డించబడిన భోజనం చేస్తారో, అలాంటివారి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని కూడా వరమిచ్చాడట. అందువలన ఈ రోజున అన్నదమ్ములను అక్కా చెల్లెళ్లు .. తమ ఇంటికి భోజనానికి పిలవడం మరిచిపోకూడదు.