కార్తిక మాసంలో దీపదానం ఫలితం

కార్తిక మాసం ఎంతో విశేషమైనది .. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో దీపారాధన చేయడం వలన ఎంతటి పుణ్య ఫలం లభిస్తుందో .. దీప దానం చేయడం వలన కూడా అంతే ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కార్తిక మాసంలో 'పౌర్ణమి' నుంచి చేసే దీప దానాల వలన విశేషమైన ఫలితం ఉంటుందనేది మహర్షుల మాట. ఒక దీపాన్ని గానీ .. మట్టి ప్రమిదలలో వెలిగించిన దీపాన్ని గాని దానం ఇవ్వకూడదనే నియమం వుంది.

ఒక కొత్త పాత్రలో బియ్యం పోసి .. ఆ బియ్యం మధ్యలో రాగివి గానీ .. ఇత్తడివి గాని .. వెండివి గాని రెండు కొత్త కుందులను ఉంచి వెలిగించాలి. మూడవ దీపం 'ఉసిరిక దీపం' అయితే మంచిది. దీపాలను ఆవు నెయ్యితో గానీ .. నువ్వులనూనెతో గాని వెలిగించాలి. ఒక బంగారపు వత్తిని .. ఒక వెండి వత్తిని నూనె వత్తికి జోడించి వెలిగించాలి. సంకల్పం చెప్పుకుని ఆ తరువాత పాత్రతో సహా బ్రాహ్మణులకు దీపదానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా దీపదానం చేయడం వలన కార్తిక వ్రత ఫలితం పరిపూర్ణంగా లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరతాయి.      


More Bhakti News