శ్రీమహా విష్ణువు మేల్కొనే కార్తిక శుద్ధ ఏకాదశి
కార్తిక మాసం పరమ పవిత్రమైన మాసం. శివకేశవుల మనసును త్వరగా గెలుచుకోవడానికి మార్గాన్ని చూపించే మాసం. ఈ మాసంలో బిల్వ పాత్రలతో శివుడిని .. తులసి దళాలతో కేశవుడిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే దానాలు .. వనభోజనాలు .. వ్రతాలు అనేక రెట్ల ఫలితాలను ఇస్తాయి.
సోమవార వ్రతం .. కేదారేశ్వర వ్రతం .. కార్తీక పౌర్ణమి వ్రతం .. ఏకాదశి వ్రతం .. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం మొదలైన వ్రతాలు భక్తులు ఎక్కువగా ఆచరిస్తుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన విష్ణుమూర్తి, కార్తిక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. చాతుర్మాస్యాది దీక్షలు పూర్తయి, పూజలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అందువలన శ్రీ మహావిష్ణువు ఆరాధనలో భక్తులు తరిస్తుంటారు. ఈ మాసంలో శివాలయంలో గాని .. వైష్ణవ ఆలయంలో గాని నెయ్యితో దీపారాధన చేయడం వలన సకల శుభాలు చేకూరతాయనేది మహర్షిల మాట.