శ్రీశైల క్షేత్ర దర్శన ఫలితం
కార్తిక మాసం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో శివుడికి చేసే అభిషేకం వలన .. శివనామ స్మరణవలన .. శైవ క్షేత్ర దర్శనం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన కార్తిక మాసంలో ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలను భక్తులు దర్శిస్తుంటారు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలలో ఒకటిగా 'శ్రీశైలం' కనిపిస్తుంది. 'శ్రీగిరి'పై భ్రమరాంబాదేవి సమేతుడై శ్రీ మల్లికార్జునుడు వెలసిన ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే ముక్తి కలుగుతుంది.
కృతయుగంలో హిరణ్యకశిపుడు .. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు .. ద్వాపరయుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని .. అమ్మవారిని సేవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆది శంకరులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి కొంతకాలం పాటు ఇక్కడే తపస్సు చేసుకున్నారని స్థలపురాణం చెబుతోంది. అంతటి మహిమాన్వితమైన ఈ దివ్య క్షేత్రాన్ని కార్తిక మాసంలో దర్శించడం వలన సమస్త పాపాలు పటాపంచలైపోయి సకల శుభాలు కలుగుతాయనేది మహర్షుల మాట.