పురాణాలు పుట్టిన ప్రదేశమే నైమిశారణ్యం
పూర్వం ఋషులంతా కలిసి తాము తపస్సు చేసుకోవడానికి తగిన పవిత్రమైన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మదేవుడిని కోరారట. అప్పడు ఆయన తన 'రథచక్రం' విసిరి .. ఆ చక్రం చుట్టూ వున్న కమ్మీ ఎక్కడైతే పడుతుందో అది పరమపవిత్రమైన ప్రదేశమని సెలవిచ్చాడట. ఆ చక్రం 'నేమి' పడిన ప్రదేశమే 'నైమిశారణ్యం' అయిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశం పుణ్యస్థలిగా .. తపోభూమిగా ప్రసిద్ధి చెందింది.
వ్యాస మహర్షి ఇక్కడే 'శ్రీభాగవతం' రచించాడనీ .. శుక మహర్షికి ఇక్కడే 'మహాభారతం'ను బోధించాడని అంటారు. ఇక్కడి గోమతీ నదీ తీరంలోనే వ్యాసులవారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడనీ, పద్దెనిమిది పురాణాలను రూపొందించింది ఇక్కడేనని చెబుతారు. శ్రీరామచంద్రుడు ఇక్కడే 'అశ్వమేధయాగం' చేశాడనీ .. పాండవులు తమ అరణ్యవాస కాలంలో 12 ఏళ్ల పాటు ఇక్కడే వున్నారని స్థలపురాణం చెబుతోంది. నైమిశారణ్యంలో దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయనీ, గోమతీ నదిలో స్నానం చేయడం వలన సమస్త వ్యాధులు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.