కాలభైరవ ఆరాధన ఫలితం
ప్రాచీన శైవ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కాలభైరవ స్వామి కూడా కొలువై కనిపిస్తుంటాడు. క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. బ్రహ్మ అతిశయాన్ని అణచడానికి శివుడు హూంకరించగా, ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం వెలువడుతుంది ... ఆ రూపమే కాలభైరవుడు. పరమశివుడి ఆదేశం మేరకు బ్రహ్మ మధ్య తలను కాలభైరవుడు చిటికెన వ్రేలు గోటితో తెంపేస్తాడు. అలా బ్రహ్మ శిరస్సు తెగి పడిన ప్రదేశమే 'బ్రహ్మ కపాలం'గా ప్రసిద్ధి చెందింది.
బ్రహ్మ హత్యాపాతకం పటాపంచలు కావడానికి తాను ఏం చేయాలని సదాశివుడిని కాలభైరవుడు అడుగుతాడు. కాశీ నగరంలో అడుపెట్టగానే ఆ దోషం తొలగిపోతుందనీ, కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉండమని శివుడు ఆదేశిస్తాడు. అలా కాశీ క్షేత్రానికి చేరుకున్న కాలభైరవుడు పూజలు అందుకుంటున్నాడు. కాలభైరవుడిని శనివారంతో కూడిన త్రయోదశి రోజున నువ్వుల నూనెతో అభిషేకించాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు .. దోషాలు .. గ్రహపీడలు .. దీర్ఘ కాలిక వ్యాధులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.