తారాదేవి ఆరాధన ఫలితం
దశ మహా విద్యాలలో మొదటిరూపం కాళిక అయితే .. రెండవ రూపం తార. తార అంటే నక్షత్రం అనే అర్థం వుంది .. అలాగే 'దాటించేది' అనే అర్థం కూడా వుంది. కష్టాల నుంచి .. ఆపదల నుంచి .. సంసార సాగరం నుంచి ఆ తల్లి తన భక్తులను దాటిస్తుందనీ, అందుకే 'తార' పేరుతో పూజలు అందుకుంటోందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తారాదేవిని ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది.
వశిష్ఠ మహర్షి .. వ్యాస మహర్షి .. దూర్వాసుడు .. భరద్వాజుడు తారాదేవిని ఉపాసించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తోంది. వశిష్ఠ మహర్షి ఆ తల్లిని ఉపాసించినప్పుడు అమ్మవారు పరమశివుడిని పసిబాలుడిగా ఎత్తుకుని పాలిస్తున్నట్టుగా ప్రత్యక్షమైందట. అందుకు కారణమేమిటని వశిష్ఠ మహర్షి అడగ్గా .. క్షీర సాగర మథనంలో వెలువడిన హాలాహలాన్ని పరమశివుడు తాగగా, ఆయన గొంతు పుండులా తయారైందనీ .. ఆ బాధని తగ్గించడానికి తాను పాలిస్తున్నానని అమ్మవారు సెలవిచ్చిందట. ఆ తల్లి వాత్సల్యాన్ని చూసిన వశిష్ఠ మహర్షి ఆనంద బాష్పాలు వర్షిస్తుండగా రెండు చేతులూ జోడించాడట.