శ్రీరాముడు దర్భలపై శయనించిన ప్రదేశమే దర్భశయనం
రావణ సంహారం కోసం వానర సైన్యంతో బయలుదేరిన శ్రీరామచంద్రుడు, సముద్రంపై సేతువును నిర్మించాడు. అలా స్వామి సేతువును నిర్మించిన సమీపంలోనే 'దర్భశయనం' దర్శనమిస్తుంది. అలసిపోయిన శ్రీరాముడు ఇక్కడ దర్భలను పరచుకుని కొంతసేపు విశ్రమించాడు. అందువల్లనే ఈ ప్రదేశానికి 'దర్భశయనం' అనే పేరు వచ్చింది. దీనిని 'శరణాగత స్థలం' అని కూడా అంటారు. విభీషణుడికి శ్రీరాముడు శరణు ఒసగిన ప్రదేశమిదేనని చెబుతారు.
ఇక్కడి ఆలయంలో ఆదిశేషునిపై శయనించిన శ్రీరాముడు దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయం వెలుపల విభీషణుడు .. సుగ్రీవుల మూర్తులు కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడి 'చక్ర తీర్థం'ను సేవిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. రామాయణంలో చదువుకున్న ప్రదేశాలను ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అలాంటి అనిర్వచనీయమైన అనుభూతే దర్భశయనం చూస్తున్నప్పుడు కలుగుతుంది. శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు ... ఎంతెంత దూరం ప్రయాణించాడో కదా అనే ఆవేదన కూడా కలుగుతుంది.