మార్కండేయుడు చంద్రశేఖరాష్టకం చెప్పింది ఇక్కడేనట
పశ్చిమ గోదావరి జిల్లా .. నిడదవోలు ప్రాంతంలోని ప్రాచీన శైవ క్షేత్రాలలో 'మార్కొంపాడు' ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామి మార్కండేయ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. పూర్వం మృకండ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడు. మృకండ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామి కటాక్షం కోసం తపస్సు చేశాడట. ఆయన భక్తిని మెచ్చి సదాశివుడు ప్రత్యక్షం కాగా, తనకి ఒక పుత్రుడిని ప్రసాదించమని కోరతాడు.
దీర్ఘాయువు కలిగిన వివేక శూన్యుడైన పుత్రుడు కావాలో .. అల్పాయుష్కుడైన వివేకవంతుడు పుత్రుడుగా కావాలో కోరుకోమని పరమశివుడు అడుగుతాడు. అల్పాయుష్కుడైన వివేకవంతుడిని .. సదా శివుడి నామాన్ని సదా స్మరించే పుత్రుడినే ఇవ్వమని మృకండ మహర్షి కోరతాడు. అలా పరమేశ్వరుడి వరప్రసాదంగా మార్కండేయుడు జన్మిస్తాడు. తన అనితరసాధ్యమైన భక్తితో శివుడిని మెప్పించి చిరంజీవిగా ఆయన వరాన్ని పొందాడు. మార్కండేయుడు అర్చించిన శివలింగాన్ని ఈ క్షేత్రంలో దర్శించుకోవచ్చు. సదాశివుడికి ప్రీతి కలిగించే 'చంద్రశేఖర అష్టకం'ఈ శివలింగం దగ్గరే మార్కండేయుడు ఆశువుగా చెప్పాడని స్థలపురాణం చెబుతోంది.