వ్యాఘ్రపాద మహర్షికి అందుకే ఆ పేరు
పరమశివుడి లీలావిశేషాలను తెలుసుకోవడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఆ స్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో 'చిదంబరం' ఒకటి. 'చిదంబరం' అంటే మనసు అనే ఆకాశం అని అర్థం. ఇక్కడి మూలమూర్తిగా నటరాజస్వామినే చెప్పుకుంటారు. ఆ నటరాజస్వామిని పూజించి తరించిన మహా భక్తుడిగా 'వ్యాఘ్రపాద మహర్షి' కనిపిస్తాడు.
మధ్యందిన మహర్షి తనయుడు అనునిత్యం ఇక్కడి నటరాజస్వామిని పూజిస్తూనే పెరిగి పెద్దవాడవుతాడు. అనునిత్యం పరమేశ్వరుడిని వివిధ రకాల పూలతో పూజించేవాడు. అయితే ఇంకా వేగంగా వనాల్లో తిరగ గలిగితే స్వామి కోసం ఎక్కువ పూలు సేకరించవచ్చనే ఆలోచన ఆయనకి కలుగుతుంది. దాంతో అదే విషయమై పరమశివుడి దగ్గర ఆవేదన చెందుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై .. పులితో సమానంగా పరిగెత్తగల శక్తిని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి అంతే వేగంతో ఆయన వనాల్లో తిరుగుతూ మరిన్ని పూలు సేకరించి స్వామిని అర్చిస్తూ ఉండేవాడు. ఈ కారణంగానే ఆయన 'వ్యాఘ్రపాద మహర్షి' గా ప్రసిద్ధి చెందాడు.